Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 56

Vasishta disables Viswamitra's power !

|| om tat sat ||

ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః |
ఆగ్నేయమస్త్రముత్ క్షిప్య తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ||

'ఇట్లు చెప్పిన వసిష్ఠునితో ఆ మహాబలుడైన విశ్వామిత్రుడు అగ్నేయ అస్త్రమును సంధించి "నిలువుము నిలువుము" అని అనెను'.

బాలకాండ
ఏబది ఆరవ సర్గము.

శతానందుడు విశ్వామిత్రుని కథ చెప్పసాగెను.

’' ఓ రామా ! ప్రశాంతమైన ఆశ్రమమును నాశనము చేసిన విశ్వామిత్రునితో నీవు ఇక ఉండవు అని చెప్పిన వసిష్ఠుని కి సమాధానముగా మహాబలవంతుడైన విశ్వామిత్రుడు అగ్నేయ అస్త్రమును సంధించి "నిలువుము" "నిలువుము" అని అనెను. అప్పుడు భగవాన్ వసిష్ఠుడు కాలదండములా నున్న తన బ్రహదండమును పైకెత్తి కోపముతో ఇట్లు పలికెను. "ఓ క్షత్రబంధువా ! గాధిజ ! నిలుచునే యున్నాను. నీ శస్త్రముల బలమును చూపించుము. ఈదినమున నీ దర్పమును నాశనము చేసెదను. ఓ దుష్ట క్షత్రియ ! చూడుము నా దివ్యమైన బ్రహ్మ బలము. నీ క్షత్రియబలమేక్కడ మహత్తరమైన బ్రహ్మబలమెక్కడ ?".

' విశ్వామిత్రునియొక్క ఆగ్నేయాస్త్రమును వసిష్ఠుని ఆ బ్రహ్మదండము అగ్నిని నీరు తో చల్లార్చినట్లు శాంతము చేసెను. అప్పుడు కుపితుడైన విశ్వామిత్రుడు వారుణాస్త్రము రౌద్రాస్త్రము అదేవిథముగా పాశుపతాస్త్రము ఇషీకాస్త్రము ను ప్రయోగించెను. అలాగే మానవాస్త్రము, మోహనము అలాగే గాంధర్వము స్వాపనము జృంభణము మాదనము సంతాపన విలాపన అస్త్రములను ప్రయోగించెను. శోషణము, దుర్జయమైన దారణము, వజ్ర అస్త్రము, బ్రహ్మపాశము, కాలపాశము , వారుణపాశము ప్రయోగించెను. పైనాకాస్త్రము, దయితము , షుష్కాశనీ అర్ద్రాశనీ అను రెండూ, దండాస్త్రము, పైశాచము మొదలగు అస్త్రములను ప్రయోగించెను. ధర్మ చక్రము, కాలచక్రము, అలాగే విష్ణు చక్రము , వాయవ్యము మథనము హయశిరాస్త్రములను ప్రయోగించెను. శక్తి ద్వయములగు కంకాళము, ముసలము అలాగే , వైద్యాధరము అనబడు మహాస్త్రము, దారుణము, కాలాస్త్రములను ప్రయోగించెను. ఓ రామా ! ఘోరమైన త్రిశులాస్త్రము, కాపాలము, కంకణము అను అస్త్రములను కుడా ప్రయోగించెను. ఆ విధముగా అన్ని అస్త్రములను విశ్వామిత్రుడు ప్రయోగించెను'.

'కాని ఆ బ్రహ్మసుతుడగు వసిష్ఠుడు ఆ అన్నిటినీ తన బ్రహ్మ దండముతో నిగ్రహించెను. అది అద్భుతముగా నుండెను. అవన్నీ శాంతించ బడగా ఆ గాధి నందనుడు కోపముతో జపము చేయువారిలో శ్రేష్ఠుడైన వసిష్ఠుని మీద బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. ఆ అస్త్రము పెరుగుటచూచి అగ్ని ముందుంచుకొని దేవతలూ గంధర్వులు నాగులు భయభ్రాంతులైరి. బ్రహ్మాస్త్రముతో ముల్లోకములూ గజగజలాడి పోయెను. ఓ రాఘవ ! ఆ మహాఘోరమైన బ్రహ్మాస్త్రమును కూడా ఆ బ్రహ్మ తేజసము గల తన బ్రహ్మ దండముతో వసిశ్ఠుడు నిగ్రహించెను'.

'బ్రహ్మాస్త్రమును నిగ్రహమొనరించిన మహాత్ముడగు వసిష్ఠుని రౌద్రముగానున్న మరియు దారుణముగా నున్న రూపము ముల్లోకములనూ మూర్చిల్లచేసెను. మహానుభావుడైన వసిష్ఠుని యొక్క రోమ కూపములనుండి పొగతో నిండిన అగ్నిజ్వాలలు అగ్ని కిరణములవలె బయటికి వచ్చుచుండెను. వసిష్ఠుడు చేపట్టిన బ్రహ్మ దండము పొగలేని కాలా అగ్నివలెను మరియొక యమదండము వలెను ఉండెను'.

'అప్పుడు మునివరులందరూ జపము చేయువారలలో శ్రేష్ఠుడగు వసిష్ఠుని స్తుతించిరి. " ఓ బ్రహ్మన్ ! నీ బలము అమోఘము . నీ తేజస్సుతో ఆ ( బ్రహ్మస్త్రముయొక్క ) తేజస్సును ధరింపుము. ఓ బ్రహ్మన్ ! మహతపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపము చేయువారలలో శ్రేష్ఠుడా ! ప్రసన్నుడివి కమ్ము. లోకములకు భాధలు తొలగిపోవుగాక !"

'ఇట్లు చెప్పబడిన మహాతపశ్శాలి మహతేజోవంతుడగు వసిష్ఠుడు వెంటనే ప్రశాంతచిత్తుడాయెను.

పరాజయము పొందిన విశ్వామిత్రుడుకూడా ఇట్లు పలికెను."క్షత్రియబలము బలము కాదు. బ్రహ్మ తేజస్సుగల బలమే బలము. ఓక దండము చేతనే నా అస్త్రములన్నియు హరించబడినవి". అందువలన దీనిని (క్షత్రియబలము) త్యజించి , ప్రశాంతమనస్సుతో ఏది బ్రహ్మత్వమునకు కారణమో దానికొఱకు మహా తపస్సు చేసెదను" అని'.

||ఈ విధముగావాల్మీకి శ్రీమద్రామాయణములోని బాలకాండలో ఎబది ఆఱవ సర్గము సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

తదేతత్ సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః |
తపో మహత్ సమాస్థాస్యే యద్వైబ్రహ్మత్వకారణమ్||

"అందువలన దీనిని (క్షత్రియబలము) త్యజించి , ప్రశాంతమనస్సుతో ఏది బ్రహ్మత్వమునకు కారణమో దానికొఱకు మహా తపస్సు చేసెదను".

 

|| om tat sat ||